CHANDRABABU NAIDU రెండేళ్ళ పాలన ఎలా వుందో తెలిస్తే షాక్ అవుతారు



ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకుంది.తన పాలన ఎలా సాగిందన్నది విశ్లేషించుకోవడం నిజానికి మన కన్నా చంద్రబాబుకే ఎక్కువ అవసరం. కాని చంద్రబాబు కాని, ఆయన పార్టీ నేతలు కాని, మంత్రులు కాని విశ్లేషణల కన్నా , ఆత్మ విమర్శల కన్నా రెండు కోణాలలో జనాన్ని నమ్మించాలని చూస్తున్నట్లుగా కనిపిస్తుంది.ప్రభుత్వంలోకి రావడానికి ఎన్నో వందల హామీలు ఇచ్చి ఉండవచ్చు.వచ్చిన తర్వాత వాటిలో కొన్నిటిని అమలు చేయడానికి ప్రయత్నించి ఉండవచ్చు. ఆ క్రమంలో కొన్ని ఇబ్బందులు సహజంగానే వస్తాయి.వాటిని కూడా అర్దం చేసుకోవచ్చు. కాని వాటిని ప్రజలకు నిజాయితీగా వివరించి ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేసి ఉంటే చంద్రబాబు ప్రభుత్వానికి పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. ఒక అబద్దాన్ని నమ్మించడానికి వంద అబద్దాలు ఆడతారని నానుడి.దీనిని వంటబంటించుకున్నట్లుగా ప్రభుత్వ నేతలు వ్యవహరించడం వల్ల ఎక్కువ నష్టపోతున్నారు. హామీలు అమలు చేస్తారా?లేదా అన్నది ఒక అంశం అయితే మౌలికంగా ప్రభుత్వంలో ఉన్నవారికి ఉండవలసిన కనీస నిజాయితీ లోపించడం అతి పెద్ద సమస్య గా ఉంది.ఇదేదో నన్ను వృత్తిపరంగా ఇబ్బంది పెట్టారనో,మరొకటనో ద్వేషంతో రాయడం లేదు. కేవలం సమాజాన్ని ముందుకు తీసుకు వెళ్లవలసిన వారు ఇలా వ్యవహరించడం ప్రజలకు ఎంతో నష్టమన్న ఆవేదనతోనే చెబుతున్నాను. రెండు ప్రధాన విషయాలు చంద్రబాబు కాని, ఆయన మంత్రివర్గ సహచరులు కాని చెబుతుంటారు. ఒకటి రాష్ట్రం చాలా కష్టాలో ఉంది.రెండు రాష్ట్రం ఈ రెండేళ్లలో చాలా అభివృద్ది చెందింది.పది శాతమో, పదిహేను శాతమో వృద్ది రేటు సాదించేశాము అని అంటారు. ఇక్కడే వైరుద్యం ఉంది. రాష్ట్రం కష్టాలలో ఉంటే ఇంత అబివృద్ది ఎలా సాదించారన్న సందేహం ఎవరికైనా వస్తుంది. కాని సందేహాలు పెట్టుకోవద్దని, తాము చెప్పింది విని ఊరుకోవాలని ఏలికల కోరిక. చంద్రబాబు కూడా ఇదే మాట అంటుంటారు. అవసరమైతే మరో రెండు గంటలు ఎక్కువ కష్టపడతా.నిజమే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవారు రెండు గంటలు ఎక్కువ కష్టపడితే మొత్తం సమస్యలన్నీ తీరిపోతే , డబ్బులు సమకూరితే అంతా సంతోషించవలసిందే. కాని అలా ఎలా జరుగుతుందన్నది అర్దం కాదు.రెవెన్యూ లోటు పదహారు వేల కోట్లు ఉంది. అయినా చంద్రబాబు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని చెబుతుంటారు. చంద్రబాబు అయినా మరొకరు అయినా వివిధ స్కీములు అమలు చేసేది ప్రభుత్వ డబ్బుతోనే తప్ప సొంత డబ్బులతో కాదు కదా.మరి అయితే అంత రెవెన్యూ లోటు ఉంటే ఇంత డబ్బు ఎలా పుట్టుకు వస్తుందన్న సంశయం ఎవరికి రాకూడదన్నది వారి ఉద్దేశం కావచ్చు.రుణమాఫీ 24 వేల కోట్లు చేసేశాం,చరిత్రలోనే ఎవరూ చేయలేదని వారు చెబుతుంటారు. నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బు లేకపోతే ఆయన చెప్పినట్లు 24 వేల కోట్ల రూపాయలు కాకపోయినా పది వేల కోట్లు అనుకున్నా,అది ఎక్కడ నుంచైన సృష్టించారా అని ఎవరూ అడగకూడదు.ఈ రుణ మాఫీ మంచి,చెడు పక్కన బెడితే, అది సరిగా అమలు జరగక వడ్డీలు కట్టలేక, రుణాలు పెరిగి రైతులు సతమతం అవుతున్నారని విపక్ష నేత జగన్ సమక్షంలో కొందరు రైతులు వాపోయారు. డ్వాక్రా మహిళలను ఆదుకున్నామని ఆయన చెబుతుంటారు. డ్వాక్రా మహిళ రుణాలు మొత్తం రద్దు చేస్తామని చెప్పారా?లేక ఇలా పదివేల చొప్పున ఇస్తామని టిడిపి మానిఫెస్టోలో పెట్టారా అన్నది వారు ఎన్నడైనా విశ్లేషించుకున్నారా?ముద్దు కృష్ణమనాయుడు వంటివారు డెబ్బైఐదు శాతం హామీలు అమలు చేసేశామని ఒక అడుగు ముందుకేసి చెప్పవచ్చు. తప్పు లేదు. ఇక్కడ సమస్య ఏమిటంటే ఈ హామీలు అమలు చేయకపోయినా, ఫలానా ఇబ్బంది వల్ల చేయలేకపోయాం. ఈ తప్పు జరిగింది. ఇంతవరకు చేశాం అని చెప్పి సర్దుకుంటే ప్రజలు కూడా అర్ధం చేసుకునేవారు.ఉదాహరణకు 1996లో లోక్ సభ ఎన్నికలకు ముందు చంద్రబాబు కిలో రెండు రూపాయల బియ్యం పధకం కొనసాగిస్తామని, మద్య నిషేదం, తదితర అంశాలలో అనేక ప్రచారాలు చేశారు. ఎన్నికలు అయిన తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ అంటూ ఒక కార్యక్రమం పెట్టి మద్య నిషేధం ఎత్తివేయడం, బియ్యం దర రెండు రూపాయల నుంచి ఐదు రూపాయలకు పెంచడం తదితర నిర్ణయాలు చేశారు. అప్పుడు రాజకీయంగా కొంత విమర్శ వచ్చినా విశ్లేషిస్తే ఆయన చేసిన దానిలో పెద్ద తప్పు లేదన్న అబిప్రాయం కలిగించగలిగారు. ఎందుకంటే ప్రభుత్వానికి సంబందించి వాస్తవాలు చెప్పడానికి యత్నించారన్న భావన కలిగింది. కాని ఇప్పుడు అలా చేయలేకపోతున్నారు.ఏదో కంగారు..ఏదో అనుమానం.. వాటిని గమనిస్తే గిల్టీ కాన్సస్ తో చంద్రబాబు ఉన్నారా అన్న భావన వస్తుంది.దానిని సానుకూలంగా మార్చుకోకుండా మరిన్ని తప్పులు చేస్తున్నారన్న సందేహం వస్తుంది.ఒక మాట చెప్పవచ్చు. ప్రస్తుతం చేస్తున్న పాలన కన్నా 1996-2004 మధ్యే ఆయన కొంత బెటర్ గా ఉన్నారా అనిపిస్తుంది.అన్ని పరస్పర విరుద్దమైన ప్రకటనలే. మనవద్ద డబ్బులు లేవు..అయినా ప్రపంచ స్థాయి రాజధాని కడతా.. , మనం కష్టాలలో ఉన్నాం..అందరూ త్యాగాలు చేయాలి...ప్రత్యేక విమానాలలో తిరిగితే తప్పేమిటి? అంతేకాదు.టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో చంద్రబాబు క్యాంప్ ఆఫీస్ లకు అయిన ఖర్చు ఎనభై కోట్లు అని ఒక వార్త వచ్చింది.దానిని ప్రభుత్వం ఖండించినట్లు కనిపించలేదు.ప్రజలను త్యాగాలు చేయాలంటున్న ముఖ్యమంత్రి ఇలా ఖర్చు చేయవచ్చా అంటే ఏమి చెబుతాం .ఇక ప్రత్యేక హోదా కోసం పోరాడతాం..కాని అది వస్తే మాత్రం ఏమి అవుతుంది?అని ఆయనే అంటారు. ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామన్నపపుడు సంతోషం కలుగుతుంది.కాని అవి సరిగా జరగడం లేదన్న వార్తలు వచ్చినప్పుడు బాద కలుగుతుంది. కాపులకు సంబందించి కూడా అలవి కాని హామీలు ఇచ్చి ఇప్పుడు సమస్యలో పడ్డారు. ముద్రగడ పద్మనాభం నేరుగా ముఖ్యమంత్రి అబద్దాలు ఆడుతున్నారని చెబుతున్నారంటే పరిస్థితి అర్దం చేసుకోవచ్చు. తుని రైలు విద్వంసం ఘటన ప్రభుత్వ వైఫల్యానికి ఒక నిదర్శనం. ఒక రైలు మొత్తం క్షణాలలో తగలబడదు. అంత గొడవ జరుగుతుంటే పోలీసు యంత్రాంగం ఎందుకు చూస్తూ ఊరుకుందో చెప్పకపోగా, ఘటన పూర్తి అయి,అవకముందే విపక్ష నేత జగన్ పై ముఖ్యమంత్రే ఆరోపణ చేసే స్థితికి వచ్చారంటే ప్రభుత్వం బాగా పనిచేస్తోందని అనుకోగలుగుతామా? రాజకీయాలు ఏమైనా శాంతి భద్రతల విషయంలో కూడా చంద్రబాబు రాజకీయం చేయడానికి వెనుకాడకపోవడం దురదృష్టకరం. దీక్ష సమయంలో తుని ఘటన కేసులు ఉండవని హామీ ఇచ్చారని ముద్రగడ అంటున్నారు.అది నిజమే అయితే ప్రభుత్వం పెద్ద తప్పు చేసినట్లే అవుతుంది.పైగా ముద్రగడ ఒక మాట గుర్తు చేస్తున్నారు. పరిటాల రవి హత్య జరిగినప్పుడు చంద్రబాబు టిడిపి కార్యకర్తలతో విద్వంసం సృష్టించారని ఆయన ఆరోపించారు.దానికి టిడిపి నేతలు జవాబు చెబుతారా?చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలలో అసలు ఏవీ మంచివి కావని ఎవరూ చెప్పజాలరు. రాజధానికి అన్ని వేల ఎకరాల భూమి అవసరమా?కాదా అన్నది ఒక చర్చ అయినా, వారికి ఇచ్చిన ప్యాకేజీ బాగానే ఉందని అనుకోవచ్చు.అలాగే ఇసుక ఫ్రీ గా ఇవ్వడం కూడా మంచిదే.పెన్షన్లు, రేషన్ , పాస్ పుస్తకాలు ఇవ్వడానికి కొన్ని సంస్కరణలు తీసుకువచ్చామని చెబుతున్నారు.అంతవరకు ఎవరూ కాదనరు. ఓటుకు నోటు కేసు దెబ్బతో విజయవాడకు తరలిన ముఖ్యమంత్రి రాజధానిలో భవన నిర్మాణం పూర్తి కాకుండానే ఉద్యోగులను ఎందుకు అవస్థల పాలు చేస్తున్నారో అర్దం కాదు. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని ఉపన్యాసాలు చెప్పిన పెద్దలు, సంతలో పశువుల్ని కొన్నట్లు ఎమ్మెల్యేలను కొంటున్నారని గతంలో ఆరోపణలు చేసిన చంద్రబాబు నాయుడు, సరిగ్గా అవే ఆరోఫణలకు గురి అవుతున్నారు.ఎలాంటి భేషజం లేకుండా ,అప్రతిష్ట అన్న ఫీలింగ్ కూడా లేకుండా వేరే పార్టీ ఎమ్మెల్యే కి కండువా కప్పి సంతోషపడుతున్నారు.రాష్ట్ర విభజనను తెలుగుదేశం పార్టీ వ్యతిరేకించినట్లు , విభజన అన్యాయం అంటూ చంద్రబాబు నవనిర్మాణదీక్షలోకాని,ఇతరత్రా చెప్పుకోవడం ఆశ్చర్యంగానే ఉంటుంది. తెలుగుదేశం పార్టీ విభజనకు అనుకూలంగా తీర్మానం చేయడమే కాదు..ఒకటికి రెండుసార్లు విభజన లేఖలు ఇచ్చి కూడా ధైర్యంగా ప్రజలను నమ్మించగలగడం బహుశా చంద్రబాబు వల్లే అయిందంటే ఆశ్చర్యంగానే ఉంటుంది.తెలంగాణ వచ్చిందని అవతరణ దినోత్సవం ఒకరోజుతో తెలంగాణ ప్రభుత్వం సరిపెట్టుకుంటే, చంద్రబాబు మాత్రం వారం రోజుల పాటు కోట్లు ఖర్చు పెడుతూ సంకల్పం అంటూ చెప్పిన విషయాలనే చెబుతూ ఎనిమిది రోజులు గడిపడం కూడా విశేషమే అని చెప్పాలి.ఇవన్ని విమర్శలు అనుకుంటే మనం ఏమి చేయలేం.ముందుగా వీటిపై ఆత్మ విమర్శ చేసుకోవలసింది చంద్రబాబు ,ఆ తర్వాత కూడా చంద్రబాబే.ఎందుకంటే చంద్రబాబు కు తప్పు చేస్తున్నారని చెప్పగల ధైర్యవంతుడు తెలుగుదేశంలో లేరు.అదే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ భారీ మూల్యం చెల్లించుకునేలా చేసే ప్రమాదం ఉంది.ఇంకా మూడేళ్ల గడువు ఉంది. ఇప్పుడైనా చంద్రబాబు మారితే ఆయనకే మేలు.
Similar Videos

0 comments: